ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఆరంభించిన ‘అంకుర కేంద్రం’- టీహబ్‌తో కలసి పనిచేస్తామని ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సత్య నాదెళ్ల వెల్లడించారు. ‘‘టీ హబ్‌తో కలిసి పని చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. మీ స్వప్నాలను సాకారం చేయడానికే టీ హబ్‌లో భాగస్వాములం అవుతున్నాం. టీ హబ్‌తో కలిసి పని చేస్తాం’’ అని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో స్టార్ట్‌పలకు చేయూతనిచ్చేందుకు మైక్రోసాఫ్ట్ అన్ని విధాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. సొంత నగరం హైదరాబాద్‌కు నాలుగు రోజుల ప్రైవేట్ పర్యటనపై వచ్చిన సత్య నాదెళ్ల సోమవారం గచ్చిబౌలి త్రిబుల్ ఐటీ క్యాంప్‌సలో తెలంగాణ ప్రభుత్వం పీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేసిన అతి పెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ టీ -హబ్‌ను సందర్శించారు. ఐటీ మంత్రి కేటీఆర్ స్వయంగా స్వాగతం పలికి సత్య నాదెళ్లను టీ హబ్ భవనంలోకి తీసుకెళ్లారు. టీ హబ్‌లోని వసతులను దగ్గరుండి చూపించారు. తన సొంత నగరంలో ఔత్సాహికుల కోసం ఏర్పాటు చేసిన టీ హబ్ అద్భుతమైన క్షేత్రమని సత్య అన్నారు. స్టార్టప్ ఎకో సిస్టమ్ బలపడేందుకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
"వైఫల్యాన్ని ఎదుర్కోవడం కాదు. వైఫల్యం నుంచి ఏం నేర్చుకున్నావనేది ముఖ్యం. నా విజయగాథలన్నీ నా వైఫల్యాల నుంచి నేర్చుకున్న గుణపాఠాలే".
మీ ఔత్సాహిక కలల నుంచి స్ఫూర్తి పొందాలనే ఇక్కడికి వచ్చాను. మీ మెదడులో మొలచిన ఆలోచనాకుంరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నీరుగారనివ్వకండి. ఆ ఆలోచనకు నీరుపోస్తూ ఆచరణలో ముందుకు సాగే సత్తాను సాధించుకోండి. అది నిరంతరం కొనసాగే సంస్కృతిని అలవర్చుకోండి. అలాంటి పని సంస్కృతిలో ఎంతగా జీవిస్తే మీ వ్యాపారం అంత సుస్థిరంగా ఎదుగుతుంది. అంకుర రంగంలో భారతీయుల ప్రతిభ అనూహ్యంగా వెలుగుతోంది. భారతీయులు ఈ రంగాన్ని శాసించబోతున్నారు’’ అని సత్య నాదెళ్ల ప్రోత్సహించారు. అందరికీ అంతర్జాల సౌకర్యం కల్పించడానికి మైక్రోసాఫ్ట్ సంస్థ ఆలోచిస్తున్న ‘వైట్‌స్పేస్ టెక్నాలజీ’ గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ప్రతి ఒక్కరికీ అంతర్జాల సదుపాయం అందుబాటులో రావాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ.. ఇందుకోసం స్థానిక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను మైక్రోసాఫ్ట్ ప్రోత్సహిస్తుందన్నారు.
"మేం చదువుకునేటప్పుడు ఇక్కడ టీ-హబ్‌ల్లాంటివి లేవు. అప్పట్లో టి-అంటే ట్యాంక్‌బండేనని చమత్కరించారు".
తరగతి గదుల డిజిటైజేషన్, మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కనెక్టివిటీ వంటి పలు రంగాల్లో మైక్రోసాఫ్ట్ సహకారాన్ని కోరినట్టు మంత్రి కేటీఆర్ చెప్పారు. సత్య నాదెళ్ల కూడా ఈ విషయంలో ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. మైక్రోసాఫ్ట్ కీలక భూమిక పోషిస్తున్న ‘వైట్ స్పేస్ టెక్నాలజీ’లో కలిసి పని చేయాలని భావిస్తున్నామన్నారు. తాము చివరి మైలురాయి వరకు కనెక్టివిటీని అందించాలని కోరుకుంటున్నామని, కానీ... సత్య మాత్రం ఈ టెక్నాలజీలో స్థానిక ఔత్సాహికులు ముందుకు రావాలని, మైక్రోసాఫ్ట్ సంస్థతో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారని వివరించారు. సుస్థిర వ్యాపారాభివృద్ధికి క్లౌడ్ కంప్యూటింగ్‌పై పని చేయాలనుకుంటున్నామని మంత్రి చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన, మేలైన విద్యను అందించాలని ప్రభుత్వం కోరుకుంటోందని, అందుకే రాష్ట్రంలోని వేలాది పాఠశాలలను డిజిటలైజ్ చేయాలని కోరుతున్నామని కేటీఆర్ వివరించారు. కార్యక్రమంలో ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా, హ్యూలెట్ ప్యాకార్డ్ అనుబంధ కంపెనీ అరుబా నెట్‌వర్క్స్ సీటీవో కీర్తి మెల్కొటే, నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి, డాక్టర్ రెడ్డీస్ లాబ్ సీఈవో జీవీ ప్రసాద్, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన, టీ-హబ్ సీఈవో జయ్‌కృష్ణన, సీఓఓ శ్రీనివాస్ కొల్లిపర తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment